శ్రీకృష్ణ కమిటీ చూపించే పరిష్కారం ఏమిటి?
కొంతకాలంగా శ్రీకృష్ణ కమిటీ సభ్యులు చేస్తున్న వ్యాఖ్యలను చదువుతూ ఉంటే నాకు వాళ్ళ రిపోర్ట్ ఎలా ఉండబోతోంది అన్న ప్రశ్నకు ఒక జవాబు తడుతోంది. ఇది పూర్తిగా నా ఊహ మాత్రమే. నివేదిక అందాకే నిజానిజాలు తెలుస్తాయి.
ముందుగా నేను ఈ అభిప్రాయానికి రావడానికి గల కారణాలు చెబుతాను. అవి శ్రీకృష్ణ కమిటీ సభ్యులు వేరు వేరు సందర్భాలలో చేసిన ప్రకటనలే.
1. మా నివేదిక అందరికీ ఆమోదయోగ్యంగా ఉంటుంది.
2. అన్ని పరిస్థితులనూ పరిగణనలోకి తీసుకుంటాము.
a. డిసెంబర్ 9కి ముందు, తరువాత పరిస్థితులు
b. సీమాంధ్రలో నిరసనలు
c. తెలంగాణ ఉపఎన్నికలు
d. క్షేత్రస్థాయి పర్యటనలు
e. భావగర్భితమైన అంశాలు
3. మా కమిటీ వివిధ ప్రత్యామ్నాయాలు సూచిస్తుంది.
4. తుది నిర్ణయం ప్రభుత్వానిదే.
Statisticsలో Pareto Chart అని ఒక గణన ప్రక్రియ ఉంది. దాని ఆధారంగా లెక్క వేస్తే అత్యంత సమస్యాత్మకమైన అంశం ఏది అన్నది తెలుస్తుంది. దాని ప్రకారం చూస్తే కమిటీ పని, వేసే ప్రశ్నలు స్థూలంగా ఇవి.
సీమాంధ్రులకు: ఎందుకు విడిపోకూడదు అనుకుంటున్నారు?
తెలంగాణ వాసులకు: కలిసి ఉండడం వలన ఎక్కడ నష్టపోతున్నారు?
ఈ రెండు ప్రశ్నలకు సింహభాగం ప్రజలనుండి వస్తున్న సమాధానం "హైదరాబాద్". ఈ నగరం మనది అన్న అభిప్రాయం అందరి మదిలోనూ నాటుకుపోయింది. ఇది వదులుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కనుక కమిటీ ఇచ్చే పరిష్కారం అంతా కూడా ఈ నగరపు సమస్యని పరిష్కరించడంలోనే ఉంది.
ఈ సమస్యకు పరిష్కారం కనుక్కోవడానికి కొన్ని మార్గదర్శకాలు కూడా ఉన్నాయి.
1. ఏ ఒక్కరికో లాభం/నష్టం కలిగించేటట్లు ఉండకూడదు. అప్పుడే అది అందరి అంగీకారాన్ని పొందుతుంది.
2. భారతదేశ రాజ్యాంగం ప్రసాదించిన హక్కులను కాలరాసేదిగా ఉండరాదు.
3. దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి సవాలు కాకూడదు. వేర్పాటువాదాన్ని/ద్వేషాన్ని ప్రోత్సహించేదిగా ఉండకూడదు.
ఈ మార్గదర్శక సూత్రాలను అనుసరించి కమిటీ కొన్ని పరిష్కారాలు సూచించగలదు.
1. అందరికీ చెందేటట్లు: సీమాంధ్రను, తెలంగాణను విడదీసి హైదరాబాదును ఉమ్మడి రాజధానిగా గుర్తించాలి. ఈ విధానం ఇప్పటికే పంజాబ్,హర్యానా రాష్ట్రాలలో అమలులో ఉంది. ఆ విధానాన్నే ఇక్కడా మరింత పటిష్టంగా అమలు చేయవచ్చు.
2. ఎవరికీ చెందనట్లు: సీమాంధ్రను, తెలంగాణను విడదీసి వాటికి వేరు వేరు రాజధానులు ప్రకటించి హైదరాబాదును కేంద్రప్రాలిత ప్రాంతంగా గుర్తించవచ్చు. యానాం, పాండిచ్చేరి (పుదుచ్చేరి), గోవా తదితర ప్రాంతాలలో జరిగినట్టు.
3. మధ్యే మార్గం: లేకుంటే హైదరాబాదును వేరే రాష్ట్రంగా గుర్తించచ్చు. ఈ పద్ధతి అనుసరించాలని ఒకటవ ఎస్సార్సీ రోజుల్లో బొంబాయి ప్రజల నుండి ప్రభుత్వానికి చాలా ఒత్తిడి వచ్చింది. వ్యతిరేకిస్తూ శివసేన "ఆమ్చీ ముంబై" అని నినాదాలు చేసింది. తత్పలితంగా ముంబాయి (రాజకీయ పరంగా) మహారాష్ట్ర రాజధాని అయినప్పటికీ, ఆర్థికంగా వేరే ప్రాంతంగా ఇప్పటికీ పరిగణించబడుతోంది. ఈ పద్ధతి అనుసరించవచ్చు.
ఈ పద్ధతుల వలన అతి పెద్ద సమస్య అయిన హైదరాబాద్ కు పరిష్కారం దొరుకుతుంది. ఇక ""తెలుగు జాతి అంతా ఒక్కటే"" లాంటి భావగర్భితమైన అంశాలంటారా? వీటి వలన కొద్ది రోజులు ఆగ్రహావేశాలు ప్రబలినా అవి చల్లారిపోతాయి.
ఇక నదీ జలాల పంపిణీ వంటి చిక్కులంటారా? అవి నిఝ్ఝంగా తీర్చలేని సమస్యలు కావు. ఇప్పటికే అంతర్రాష్ట్ర నదీ జలాల పంపిణీకి నియమావళి, నిబంధనలు ఉన్నాయి. బచావత్ ట్రైబ్యునల్ ఉంది. వాటిని అనుసరిస్తే ఈ సమస్యలు పరిష్కారం అవుతాయి. "విభజన తరువాత సమస్యలు వస్తే ఏం చేయాలి?" అన్న ప్రశ్నకు పెద్దగా ఆలోచించక్కరలేదు. ప్రస్తుతం మనకూ మహారాష్ట్రకూ/కర్ణాటకకూ వివాదాలు రగులుతున్నాయి. ఏం చేస్తున్నాం? అప్పుడూ అదే చేస్తాం.
ఈ మార్గాలలో ఏది ఎంచుకున్నా రాష్ట్రం అంతటా ఆగ్రహావేశాలు తప్పవు. కానీ హైదరాబాదును గుత్తంగా ఏ ఒక్కరికో అప్పగించేకన్నా ఇది చాలా మేలు పధ్ధతి. పంచతంత్రంలో రెండు పిల్లులు, రొట్టెముక్క గొడవను కోతి ఎలా తీర్చిందో తెలుసుగదా? ప్రస్తుత పరిస్థితికూడా అలాంటిదే.
కానీ ఏ నిర్ణయమూ కేంద్రం వెలువరించేముందు ఒక జాగ్రత్త వహించాలి. నిర్ణయానికి తామందరం కట్టుబడి ఉంటామని అన్ని ప్రాంతాల నాయకుల వద్దా హామీ తీసుకోవాలి. లేకుంటే అది మరొక చారిత్రక తప్పిదం అవుతుంది.
నాకు ఈ పరిస్థితి గ్రీకు పురాణాల్లోని హెలెన్ వివాహ ఘట్టాన్ని స్ఫురింపజేస్తోంది. హెలెన్ స్పార్టా దేశపు యువరాణి. అద్భుత సౌందర్యరాశి. ఆమెను వివాహమాడటానికి అందరు రాజులు పోటీ పడతారు. ఎవరినీ కాదనటానికి ఆమె తండ్రికి ధైర్యం చాలదు. ఎంతకుఉ విషయం తేల్చకుండా నానుస్తూ ఉంటాడు. అతనికి ఇథాకా రాజు యులిసిస్ ఉపాయం చెబుతాడు. వరుడు ఎవరన్నది ప్రకటించేముందు రాజలందరి చేత దైవసాక్షిగా ప్రమాణం చేయిస్తాడు. ఏమని? హెలెన్ భర్త మీద ఎవరైనా దండెత్తితే మిగిలిన్ రాజులందరూ ఏకమై హెలెన్ భర్తకు బాసటగా నిలవాలని. ఈ మాట అందరూ ఇచ్చిన తరువాతే వరుడిని ప్రకటిస్తాడు. తక్కిన పోటీదార్లు అసూయ చెందినా దండయాత్ర భయంతో ఆయన నిర్ణయాన్ని అంగీకరిస్తారు.
ఇప్పుడు మనకి ఇదే పరిస్థితి పునరావృతం అయ్యింది. హైదరాబాదును హెలెన్ అనుకుంటే, రాయలసీమ, కోస్తా, తెలంగాణా వరులు అయ్యారు. కేంద్రం తండ్రి పాత్రలోకీ, శ్రీకృష్ణ కమిటీ యులిసిస్ పాత్రలోకీ కుదిరారు. ఇక ఒడంబడిక చేసుకుని నిర్ణయాన్ని ప్రకటించాలి. లేకుంటే మన రాజకీయనాయకులు వాళ్ళ సేనలను (అదే అమాయకపు ప్రజలను) ఉసిగొలిపి యుద్ధం చేయిస్తారు. తాము మాత్రం బాధ్యత తీసుకోకుండా తప్పును పోలీసుల మీదకు నెట్టేస్తారు.
ఇది చెప్పుకున్నాక మరో విశేషం కూడా చెప్పుకోవాలి. గ్రీకు రాజులు తాము చేసిన ప్రమాణం అనూహ్యమైన ఫలితాలను ఇచ్చింది. హెలెన్ తన భర్తను వదిలి ట్రోయ్ యువరాజుతో పారిపోయినప్పుడు వారంతా కలిసి ట్రోయ్ పైకి దండెత్తవలసి వచ్చింది. ఆ యుద్ధం పదేళ్ళు జరిగింది. అలాగే మన హైదరాబాదు కూడా మరో రాష్ట్రంలో కలిసిపోతానంటే పరస్పరం కలహించుకుంటున్న కోస్తా, తెలంగాణా, రాయసీమ ఒకటిగా కావల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు. ఏర్పడకపోనూవచ్చు. చేప్పలేము. నందో రాజా భవిష్యతిః